AP 10th Class FA3 Telugu Question Paper 2026-27 – Model Paper with Answers (35 Marks)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పదో తరగతి తెలుగు FA3 కు సిద్ధమవుతున్నారా? AP 10th Class FA3 Telugu Question Paper 2026-27 నమూనాలో యుద్ధ విజేత, సూక్తి సుధ పాఠాలు, రామాయణం సుందరకాండ, యుద్ధకాండలపై 14 ప్రశ్నలు, 35 మార్కులు ఇక్కడ ఉన్నాయి. ప్రతిపదార్థం, ఛందస్సు, అలంకారం, వ్యాకరణం అన్నీ జవాబులతో. పద్యాలు, గద్యం పాఠ్యపుస్తకంలో ఉన్నట్లే ఇచ్చాం.

తెలుగు FA3 అసలు పేపర్ జవాబులు (Key Paper) జనవరిలో పరీక్ష రోజే ఇక్కడ పెడతాం. లింక్ నేరుగా రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి.

ఈ పేజీలో: పేపర్ విధానం | FA3 పాఠాలు | 14 ప్రశ్నలు | FAQs

AP 10th Class FA3 Telugu 2026-27: 14 ప్రశ్నల విధానం

5 అక్టోబర్ 2026 న జరిగిన FA2 తెలుగు అసలు పేపర్ (Exam Code 024) విభాగాలే ఇక్కడ: ప్రతిపదార్థంతో మొదలై, రచయిత పరిచయం, ప్రక్రియ, 8 మార్కుల ప్రశ్న, అలంకారం, ఛందస్సు, ఏడు ఒక మార్కు ప్రశ్నలు.

విభాగంప్రశ్నలుమార్కులు
Iప్రతిపదార్థం 4, పరిచిత గద్యం 48
IIరచయిత పరిచయం 4, ప్రక్రియ 4, 8 మార్కుల ప్రశ్న (ఎంపికతో)16
IIIఅలంకారం 2, ఛందస్సు 2, ఏడు 1 మార్కు ప్రశ్నలు11
మొత్తం14 ప్రశ్నలు35

FA2 అసలు ప్రశ్నలు, జవాబులు AP 10th Class FA2 Telugu Question Paper లో, అన్ని సబ్జెక్టుల FA3 వివరాలు AP FA3 Syllabus 2026-27 లో ఉన్నాయి.

10th Class FA3 Telugu Syllabus 2026-27 (అంచనా)

SA1 లో తెలుగు పరిమళం 1 నుంచి 10 పాఠాలు, రామాయణం నాలుగు కాండలు వచ్చేశాయి. వాటి అసలు పేపర్ AP 10th Class SA1 Telugu Key Paper లో ఉంది. పుస్తకంలో మిగిలినవి, గత ఏడాది FA3 జాబితా రెండూ ఇవే:

పాఠంప్రక్రియ, కవి / రచయితఈ పేపర్‌లో
11. యుద్ధ విజేతవచన కవిత, నేతల ప్రతాప్ కుమార్ (సమతావసంత గానం)1(అ), 4, 5(అ), 7, 8, 9, 10, 11, 12, 14
12. సూక్తి సుధవ్యాసం, ఎస్. గంగప్ప (సాహిత్యానుశీలన); అన్నమయ్య కీర్తనలు1(ఆ), 3, 6
ఉపవాచకం: సుందరకాండహనుమంతుని సముద్ర లంఘనం, సీతాన్వేషణ, లంకాదహనం5(ఆ)
ఉపవాచకం: యుద్ధకాండసేతు నిర్మాణం, రామరావణ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం2, 13

AP 10th Class FA3 Telugu Question Paper 2026-27 సిలబస్ – యుద్ధ విజేత, సూక్తి సుధ, సుందరకాండ, యుద్ధకాండ

AP 10th Class FA3 Telugu Model Paper: 14 ప్రశ్నలు, జవాబులతో

ముందు 1 గంట 15 నిమిషాలు టైమ్ పెట్టుకుని రాయండి. 1, 5 ప్రశ్నల్లో ఒక్కదానికే రాయాలి. తర్వాత ఒక్కో జవాబు తెరిచి పోల్చుకుని టిక్ పెట్టండి.

విభాగం I: (8 మార్కులు)

1. కింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి.
(అ)

చం. వినయ విధేయ వర్తనుఁ డవిస్మృతిశాలి యసంశయా శయుం
డనితర సక్తమానసుఁ డపార్థవిదూరుఁ డధీతపాఠచిం
తనపరుఁడున్ సుఖగ్రహణ ధారణ గణ్యుఁడు సూక్ష్మబుద్ధి సు
స్వనుఁడు గురుప్రియుండునగువానినె శిష్యునిగాఁ గొనందగున్

(లేదా)
(ఆ)

ఎంత చదివిన నేమి వినిన తన
చింతయేల మానుసిరులేల కలుగు
ఇతర దూషణములు యెడసినగాక
మతిచంచలము గొంతమానినగాక
గతియేల కలుగు దుర్గతులేలమాను

  [4 మార్కులు]

జవాబు చూడండి
(అ) ప్రతిపదార్థం (మహేంద్ర విజయము, దేవులపల్లి సోదర కవులు; యుద్ధ విజేత పాఠాంత పద్యం):
వినయ విధేయ వర్తనుఁడు = వినయంతో, (గురువు) చెప్పినట్లు నడుచుకొనేవాడు
అవిస్మృతిశాలి = మరపు లేనివాడు
అసంశయ + ఆశయుండు = సందేహం లేని, స్థిరమైన మనసు కలవాడు
అనితర సక్త మానసుఁడు = (గురువు, చదువు తప్ప) వేరే వాటిపై ఆసక్తి లేని మనసు కలవాడు
అపార్థ విదూరుఁడు = అపార్థాలకు దూరంగా ఉండేవాడు
అధీత పాఠ చింతన పరుఁడున్ = చదివిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ తలచుకొనేవాడు
సుఖ గ్రహణ ధారణ గణ్యుఁడు = సులభంగా గ్రహించడంలో, జ్ఞాపకం ఉంచుకోవడంలో పేరు పొందినవాడు
సూక్ష్మబుద్ధి = చురుకైన బుద్ధి కలవాడు
సుస్వనుఁడు = మంచి కంఠస్వరం కలవాడు
గురుప్రియుండు + అగువానినె = గురువుకు ఇష్టమైనవాడు అయిన వానినే
శిష్యునిగాన్ = శిష్యుడిగా
కొనన్ + తగున్ = స్వీకరించాలి
భావం: వినయంతో గురువు చెప్పినట్లు నడుచుకొనేవాడు, మరపు లేనివాడు, స్థిరమైన మనసుతో ఏకాగ్రతగా చదివేవాడు, అపార్థం చేసుకోనివాడు, చదివిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొనేవాడు, సులభంగా గ్రహించి జ్ఞాపకం ఉంచుకొనేవాడు, చురుకైన బుద్ధి, మంచి కంఠం కలిగి గురువు మనసును సంతోషపెట్టేవాడినే శిష్యుడిగా స్వీకరించాలి.

(ఆ) ప్రతిపదార్థం (అన్నమాచార్యులు; సూక్తి సుధ పాఠం):
ఎంత చదివినన్ + ఏమి = ఎంత చదివినా ఏమి లాభం
వినిన = (ఎన్ని) విన్నా
తన చింత + ఏల మాను = తన దిగులు ఎలా తొలగుతుంది
సిరులు + ఏల కలుగు = సంపదలు ఎలా కలుగుతాయి
ఇతర దూషణములు = ఇతరులను నిందించడం
యెడసినగాక = విడిచిపెడితేనే కాని
మతిచంచలము = మనసు నిలకడ లేకుండా ఉండటం
కొంత మానినగాక = కొంతైనా మానుకుంటేనే కాని
గతి + ఏల కలుగు = సద్గతి ఎలా కలుగుతుంది
దుర్గతులు + ఏల మాను = చెడు గతులు ఎలా తొలగుతాయి
భావం: ఎంత చదివినా, ఎన్ని విన్నా ఇతరులను నిందించడం మానకపోతే, మనసు చంచలత్వాన్ని కొంతైనా తగ్గించుకోకపోతే దిగులు తీరదు, సంపదలు కలగవు, సద్గతి రాదు, దుర్గతులు తొలగవు. పరనింద మానుకొని, బుద్ధి స్థిరంగా ఉంచుకొంటేనే మనిషికి సద్గతి కలుగుతుందని అన్నమయ్య బోధ.

2. కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమేగాక, దానికి భంగం కలగకుండా దానికనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తిచేయనివాడు అధముడు. సీతాదేవి కుశలవార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమియ్యగలనంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తానియ్యగల సర్వస్వమన్నాడు. ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా!

అ) ఈ మహాసముద్రాన్ని లంఘించడం ఎవరెవరికి సాధ్యం?
ఆ) ఉత్తముడైన సేవకుడు అని ఎవరిని అంటారు?
ఇ) హనుమంతునకు శ్రీరాముడు ఇచ్చిన ‘సర్వస్వం’ ఏమిటి?
ఈ) పై గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
అ) గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు.
ఆ) ఇచ్చిన పనిని సాధించడమే కాక, దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను కూడా సాధించేవాడు.
ఇ) హనుమంతుణ్ణి దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెకు హత్తుకోవడమే (తన ఆదరాభిమానాలే) తాను ఇవ్వగల సర్వస్వం అన్నాడు.
ఈ) మధ్యముడైన సేవకుడు ఎవరు? (మరో ప్రశ్న: శ్రీరాముడు ఎవరి సాహసాన్ని ప్రశంసించాడు?)
ఈ గద్యం ఉపవాచకం రామాయణంలోని యుద్ధకాండ మొదటి భాగం నుంచి.

విభాగం II: (16 మార్కులు)

3. “సూక్తి సుధ” పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
రచయిత: సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త ఎస్. గంగప్ప. పూర్తి పేరు శ్రీరామప్పగారి గంగప్ప.
జననం: ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని గ్రామంలో 08.11.1936 న వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించారు. మరణం 07.10.2022.
రచనలు: సుమారు 100 కు పైగా గ్రంథాలు రాశారు. సాహిత్యసుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పదసాహిత్యం, అన్నమాచార్యులు – ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం.
పురస్కారాలు: 1972, 1981 లలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమి అవార్డులు.
పాఠం: ఈ పాఠ్యాంశం వారి “సాహిత్యానుశీలన” గ్రంథం నుంచి గ్రహించారు.

4. “వచన కవిత” ప్రక్రియను గురించి వివరించండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
నిర్వచనం: పద్యం, గేయాల్లో ఉండే ఛందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత.
లక్షణాలు: 1. ఇది విషయ ప్రధానంగా ఉంటుంది. 2. నిత్యజీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. 3. చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమవుతుంది. 4. అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో సొబగులు అద్దుకుంటుంది.
పాఠంతో అన్వయం: మన పాఠం “యుద్ధ విజేత” నేతల ప్రతాప్ కుమార్ రాసిన వచన కవిత; “సమతావసంత గానం” కవితా సంపుటి నుంచి గ్రహించారు. “అసలు యుద్ధం అంటేనే / ఒక గెలుపు ఒక ఓటమి” వంటి చిన్న చిన్న పంక్తుల్లో, ఛందస్సు లేకుండానే లయతో యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని కవి చెప్పారు.

5. ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి.
(అ) యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
(లేదా)
(ఆ) సుందరకాండ ఆధారంగా హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్న విధానాన్ని రాయండి.   [8 మార్కులు]

జవాబు చూడండి
(అ) నమూనా జవాబు: యుద్ధం జరిగితే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మానవాళి, ప్రకృతి రెండూ నష్టపోతాయని “యుద్ధ విజేత” పాఠం చెబుతుంది. యుద్ధాలు నివారించడానికి:
1. దేశాల మధ్య సమస్యలను చర్చలు, ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవాలి.
2. ఆయుధాల పోటీ, అణ్వాయుధాల తయారీని తగ్గించాలి; ఆ డబ్బును విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేయాలి.
3. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు.
4. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలను బలోపేతం చేసి, మధ్యవర్తిత్వంతో వివాదాలు తీర్చాలి.
5. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారి శాంతి బోధనలను అందరూ పాటించాలి.
6. ప్రతి వ్యక్తి తనలోని పగ, ద్వేషం, అహంకారం విడిచిపెట్టాలి; పిల్లలకు బడి నుంచే అహింస, సహనం నేర్పాలి.
7. పాలకులు తమ స్వార్థం కోసం ప్రజలను యుద్ధాల్లోకి నెట్టకూడదు. బుద్ధుడు, అశోకుడిలా యుద్ధాన్ని గెలిచినవారే నిజమైన విజేతలు. శాంతి ఉంటేనే ప్రగతి సాధ్యం.

(ఆ) నమూనా జవాబు: 1. మహాబలుడైన మారుతి దేవతలకు నమస్కరించి, శరీరాన్ని పెంచి, మహేంద్రగిరి నుంచి సముద్రంపై ఎగిరాడు.
2. దారిలో మైనాకుడి ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి, నాగమాత సురస పరీక్షలో నెగ్గి, తనను మింగాలని చూసిన సింహికను సంహరించాడు.
3. త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరి, రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. అడ్డగించిన లంకిణిని ఎడమచేతి పిడికిలితో ఒక్కదెబ్బ కొట్టాడు.
4. రావణుని భవనాన్ని, అంతఃపురాన్ని వెతికాడు. అక్కడ నిద్రిస్తున్న మండోదరిని చూసి మొదట సీత అనుకొని, తర్వాత తన ఆలోచన తప్పని గ్రహించాడు.
5. సీత జాడ కనబడక నిరాశ చెందినా, బతికి ఉంటే శుభాలు పొందవచ్చని ధైర్యం తెచ్చుకొని అశోకవనంలోకి వెళ్ళాడు.
6. శింశుపావృక్షం ఎక్కి, కింద రాక్షస స్త్రీల మధ్య కృశించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె ధరించిన ఆభరణాలు, శ్రీరాముడు చెప్పిన గుర్తులతో ఆమె సీతే అని నిర్ధారించుకున్నాడు.
7. చెట్టుపై నుంచి రామకథను వినిపించి సీత దృష్టిని ఆకర్షించాడు; తాను రామదూతనని చెప్పి, శ్రీరాముని ఉంగరాన్ని ఇచ్చాడు.
8. సీత కాకాసురుని కథను గుర్తుగా చెప్పి, తన చూడామణిని హనుమంతునికి ఇచ్చింది. తిరిగి వచ్చిన హనుమంతుడు “చూశాను సీతమ్మను” అని శ్రీరామునికి చూడామణి సమర్పించాడు.

విభాగం III: (11 మార్కులు)

6. కింది పద్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాసి, సమన్వయం చేయండి.

సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా
సదనామయ గజరదనా
రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహా

  [2 మార్కులు]

జవాబు చూడండి
అలంకారం: ముక్తపదగ్రస్తం.
లక్షణం: ఒక పద్యపాదం గాని, వాక్యం గాని ఏ పదంతో పూర్తవుతుందో, అదే పదంతో తర్వాతి పాదం గాని వాక్యం గాని మొదలైతే అది ముక్తపదగ్రస్తం (ముక్తపదం = విడిచిన పదం, గ్రస్తం = తిరిగి గ్రహించడం).
సమన్వయం: మొదటి పాదం “మదనా” తో ముగిసి రెండో పాదం “మదనాగ” తో మొదలైంది; రెండో పాదం “సదనా” తో ముగిసి మూడో పాదం “సదనామయ” తో, మూడో పాదం “రదనా” తో ముగిసి నాలుగో పాదం “రదనాగేంద్ర” తో మొదలైంది. కాబట్టి ముక్తపదగ్రస్తాలంకారం.

7. “వినయ విధేయ వర్తనుఁ డవిస్మృతిశాలి యసంశయా శయుం” – ఈ పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో రాయండి.   [2 మార్కులు]

జవాబు చూడండి
(U = గురువు, I = లఘువు)

1234567
వి న యవి ధే యవ ర్త నుఁడ వి స్మృతి శా లియ సం శయా శ యుం
I I II U IU I II U II U II U IU I U
నజభజజజర

న, జ, భ, జ, జ, జ, ర గణాలు వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. “వ” తర్వాత “ర్త” సంయుక్తాక్షరం, “డవి” లో “వి” తర్వాత “స్మృ” సంయుక్తాక్షరం ఉండటంతో ఆ ముందు అక్షరాలు గురువులు.
యతి: 1వ అక్షరం “వి” కి 11వ అక్షరం “వి” తో యతి మైత్రి. ప్రాస: రెండో అక్షరం “న”.

8. పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై దరహాసం వెల్లివిరిసింది. (గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.)
(A) కన్నీరు   (B) చిరునవ్వు   (C) కోపం   (D) అలసట   [1 మార్కు]

జవాబు చూడండి
(B) చిరునవ్వు
దరహాసం అంటే చిరునవ్వు.

9. యుద్ధం వల్ల ఎంతోమంది అనాథలు అవుతారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
(A) సమరం, సంగ్రామం   (B) విజయం, జయం   (C) శాంతి, ప్రశాంతత   (D) కీర్తి, యశస్సు   [1 మార్కు]

జవాబు చూడండి
(A) సమరం, సంగ్రామం
యుద్ధానికి పర్యాయపదాలు సమరం, సంగ్రామం, రణం.

10. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
(A) పాపం   (B) పున్నెం   (C) పుష్పం   (D) పూనిక   [1 మార్కు]

జవాబు చూడండి
(B) పున్నెం
పుణ్యం (ప్రకృతి) – పున్నెం (వికృతి).

11. యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? (గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి.)
(A) యుద్ధో + ఉన్మాది   (B) యుద్ధ + ఓన్మాది   (C) యుద్ధ + ఉన్మాది   (D) యుద్ధం + మాది   [1 మార్కు]

జవాబు చూడండి
(C) యుద్ధ + ఉన్మాది
యుద్ధ + ఉన్మాది = యుద్ధోన్మాది. అ కారానికి ఉ కారం పరమైతే ఓ కారం ఆదేశం: గుణసంధి.

12. బుద్ధుడు భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించాడు. (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
(A) ద్విగు సమాసం   (B) బహువ్రీహి సమాసం   (C) ద్వంద్వ సమాసం   (D) షష్ఠీ తత్పురుష సమాసం   [1 మార్కు]

జవాబు చూడండి
(C) ద్వంద్వ సమాసం
విగ్రహవాక్యం: భార్యయును, బిడ్డలును. రెండు పదాల అర్థమూ ప్రధానం కాబట్టి ద్వంద్వ సమాసం.

13. “నేను శ్రీరామ దూతను” అని హనుమంతుడు సీతతో అన్నాడు. (ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా రాయండి.)   [1 మార్కు]

జవాబు చూడండి
తాను శ్రీరామ దూతనని హనుమంతుడు సీతతో అన్నాడు.
పరోక్ష వాక్యంలో ఉద్ధరణ చిహ్నాలు తీసేయాలి; “నేను” “తాను” గా మారుతుంది; “దూతను + అని” కలిసి “దూతనని” అవుతుంది.

14. యుద్ధాలు చేయవద్దు. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.)   [1 మార్కు]

జవాబు చూడండి
నిషేధార్థక వాక్యం. “చేయవద్దు” అనే క్రియ ఒక పనిని చేయకూడదని నిషేధిస్తోంది.

తెలుగు FA3 లో మార్కులు కోల్పోయే చోట్లు

  • ప్రతిపదార్థంలో పదాలను విడదీయకుండా మొత్తం పాదానికి ఒకే అర్థం రాయడం; ప్రతి పదానికీ విడిగా అర్థం రాసి, చివర భావం రాయాలి.
  • రెండు పద్యాలకూ రాసి సమయం వృథా చేయడం; ఒక్కదానికే రాయాలి.
  • ఛందస్సులో సంయుక్తాక్షరానికి ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించకపోవడం; యతి, ప్రాస రాయకపోవడం.
  • ముక్తపదగ్రస్తంలో సమన్వయం (ఏ పదం విడిచి, ఏ పదంతో మొదలైందో) చూపకపోవడం.
  • యుద్ధ విజేత కవి పేరు, సూక్తి సుధ రచయిత పేరు తారుమారు చేయడం; రచనల జాబితాలో ఒకటి రెండైనా రాయకపోవడం.

తర్వాత ఏం చదవాలి

FAQs

AP 10th Class FA3 Telugu లో ఏ పాఠాలు వస్తాయి?

28-10-2026 SA1 అధికారిక జాబితాలో తెలుగు పరిమళం 1 నుంచి 10 పాఠాలు, రామాయణం బాలకాండం నుంచి కిష్కింధా కాండ వరకు వచ్చాయి. మిగిలినవి 11 యుద్ధ విజేత, 12 సూక్తి సుధ, ఉపవాచకంలో సుందరకాండ, యుద్ధకాండ. గత ఏడాది (2025-26) FA3 జాబితాలోనూ ఇవే ఉన్నాయి. అధికారిక FA3 ఉత్తర్వు రాగానే సరిచూస్తాం.

FA3 Telugu పేపర్ ఎన్ని మార్కులు, ఎన్ని ప్రశ్నలు?

35 మార్కులు, 14 ప్రశ్నలు, 1 గంట 15 నిమిషాలు: 7 × 1, 2 × 2, 4 × 4, 1 × 8. ఇది 5 అక్టోబర్ 2026 FA2 తెలుగు అసలు పేపర్ నమూనా.

యుద్ధ విజేత వచన కవిత కదా, ప్రతిపదార్థం ఏ పద్యానికి వస్తుంది?

యుద్ధ విజేత పాఠం చివర “వినయ విధేయ వర్తనుఁ” అనే పాఠాంత పద్యం (చంపకమాల) ఉంది; సూక్తి సుధలో అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి. ఈ సాధన పేపర్‌లో ఆ రెండింటికీ ప్రతిపదార్థం ఇచ్చాం. అసలు పేపర్‌లో ఏ భాగం వస్తుందో పరీక్ష రోజే తెలుస్తుంది.

యుద్ధ విజేత కవి ఎవరు?

నేతల ప్రతాప్ కుమార్ (13.08.1965 – 08.06.2021). నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామం. ఈ పాఠం వారి “సమతావసంత గానం” కవితా సంపుటి నుంచి. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం పొందారు.

సూక్తి సుధ రచయిత ఎవరు?

ఎస్. గంగప్ప (08.11.1936 – 07.10.2022), పూర్తి పేరు శ్రీరామప్పగారి గంగప్ప. ఈ పాఠం వారి “సాహిత్యానుశీలన” గ్రంథం నుంచి. 1972, 1981 లలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డులు.

అరిషడ్వర్గాలు అంటే ఏమిటి?

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని జయించడానికి ఆత్మనిగ్రహం అవసరమని అన్నమయ్య చెప్పారని సూక్తి సుధ పాఠం వివరిస్తుంది.

ఏడుగడలు అంటే ఏమిటి?

సప్తప్రాకారాలు గల రక్షకాలు: గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవం, దాత. ఇది సూక్తి సుధ పాఠంలోని విశేషాంశం, 1 మార్కు ప్రశ్నగా రావచ్చు.

ఉపవాచకం రామాయణం నుంచి ఏ ప్రశ్నలు వస్తాయి?

వాక్యం ఏ కాండకు చెందినదో గుర్తించడం, పాత్రల స్వభావం, సీతాన్వేషణ, లంకాదహనం, సేతు నిర్మాణం, రామరావణ యుద్ధం వంటి వ్యాసరూప ప్రశ్నలు. ఈ పేపర్‌లో 2, 5(ఆ), 13 ప్రశ్నలు రామాయణం నుంచి.

ఇది అసలు FA3 పేపరా?

కాదు. పాఠ్యపుస్తకం “తెలుగు పరిమళం” ఆధారంగా మేము తయారు చేసిన సాధన పేపర్. పద్యాలు, గద్యం పుస్తకంలో ఉన్నట్లే ఇచ్చాం. FA3 రోజు అసలు పేపర్, జవాబులు ఇదే పేజీలో పెడతాం.

FA3 పరీక్షలు ఎప్పుడు?

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 4 నుంచి 7 జనవరి 2027. సబ్జెక్టు వారీ తేదీలు FA3 ఉత్తర్వు వచ్చాక AP FA3 Syllabus 2026-27 పేజీలో ఇస్తాం.

పాఠ్యపుస్తకాలు, ఉత్తర్వుల కోసం AP School Education Department. పద్యాలు, గద్యం AP SCERT “తెలుగు పరిమళం” పదో తరగతి పాఠ్యపుస్తకం నుంచి; ప్రశ్నలు, జవాబులు మా సొంతం.

పదో తరగతి అన్ని సబ్జెక్టుల జవాబులు, స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు ఒకే చోట: AP Board Solutions Class 10. SA1 పరీక్షల (9 – 20 నవంబర్ 2026) సాధనకు AP SA1 2026-27; గణితం ఎక్సర్‌సైజ్ జవాబులకు AP 10th Class Maths Solutions; SSC కి AP SSC Model Papers 2027.