AP 7th Class FA2 Telugu Question Paper 2026-27 — 05 అక్టోబర్ అసలు పేపర్, జవాబులతో
ఏడో తరగతి విద్యార్థులు 05 అక్టోబర్ 2026 న రాసిన FA2 తెలుగు అసలు ప్రశ్నపత్రం (Exam Code 724, MR-7) జవాబులు ఇవి. అపరిచిత గద్యం ప్రశ్నలు, వ్యాకరణం, సుమతీ పద్య భావం, అన్నమయ్య కవి పరిచయం — అన్నింటికీ జవాబులు ఉన్నాయి.
పేపర్ నమూనా: ఏడో తరగతి పేపర్‌లో 20 ప్రశ్నలు, 35 మార్కులు. మొదటి 15 ఒక్కో మార్కు బహుళైచ్ఛికాలు — వీటిలో 1 నుంచి 10 భాషాంశాలు, 11 నుంచి 15 చెట్ల గురించిన అపరిచిత పేరా మీద. తర్వాత రెండు పదాలతో సొంత వాక్యాలు (4), అన్నమయ్య, సుమతీ పద్యంపై రెండు 4 మార్కుల ప్రశ్నలు (8), చివరగా ఒక 8 మార్కుల వ్యాసరూప ప్రశ్న.
బహుళైచ్ఛిక జవాబులు — ఒక్క చూపులో (15 ప్రశ్నలు)
| ప్రశ్న | జవాబు | ప్రశ్న | జవాబు |
|---|---|---|---|
| 1 | (B) స్వేచ్ఛ | 9 | (C) భవిష్యత్కాలం |
| 2 | (C) కునుకు | 10 | (D) ఆలుమగలు |
| 3 | (B) ప్రథమా, ద్వితీయా, పంచమీ విభక్తి | 11 | (B) చెట్లు |
| 4 | (A) ఖడ్గం, కత్తి | 12 | (C) ఆక్సిజన్ |
| 5 | (C) సత్త్వము | 13 | (A) పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం |
| 6 | (B) అత్వ సంధి (బహుళం — యడాగమం) | 14 | (C) అవసరమైన చెట్లను మాత్రమే నరికి, వాటికి బదులుగా ఎక్కువ మొక్కలు నాటాలి. |
| 7 | (C) వైకల్పికం | 15 | (B) చెట్లను నాటడం, సంరక్షించడం |
| 8 | (C) అమహద్వాచకం, బహువచనం |
వాక్య ప్రయోగం, వ్యాసం ప్రశ్నలకు కింద ఉన్నవి ఉదాహరణలు మాత్రమే. మీ వాక్యం అర్థవంతంగా ఉంటే చాలు.
విభాగం A — బహుళైచ్ఛిక ప్రశ్నలు (15 × 1 = 15)
1. పక్షులు ఆకాశంలో యథేచ్ఛగా ఎగురుతున్నాయి. గీతగీసిన పదానికి సరైన అర్థం.
(A) వేగం (B) స్వేచ్ఛ (C) భయం (D) శబ్దము చేస్తూ
జవాబు: (B) స్వేచ్ఛ — యథేచ్ఛగా = ఇష్టం వచ్చినట్లు, స్వేచ్ఛగా.
2. కింది వాక్యంలోని భ్రమక పదాన్ని గుర్తించండి. కునుకు తీయడమంటే నిద్రపోతున్నాడని అర్థం.
(A) అర్థం (B) నిద్రపోతున్నాడు (C) కునుకు (D) తీయడం
జవాబు: (C) కునుకు — వాక్యం అర్థాన్ని వివరిస్తున్న పదం “కునుకు” (చిన్న నిద్ర). “కునుకు తీయడం” అంటే నిద్రపోవడం. గమనిక: “భ్రమక పదం” అనే మాట పాఠ్య వ్యాకరణంలో సాధారణంగా కనిపించదు. ఇది “భావార్థక పదం” (-డం తో ముగిసే పదం) కు ముద్రణ దోషం అయితే జవాబు (D) తీయడం అవుతుంది. మీ పాఠశాల key తో ఒకసారి సరిచూసుకోండి.
3. చండీదత్తుడు చంచలను దేశం నుండి బహిష్కరించాడు. వాక్యంలో ఈ విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలు ఉన్నాయి.
(A) సప్తమీ, ప్రథమా, తృతీయా విభక్తి (B) ప్రథమా, ద్వితీయా, పంచమీ విభక్తి (C) చతుర్థీ, సప్తమీ, పంచమీ విభక్తి (D) ద్వితీయా, ప్రథమా, సప్తమీ విభక్తి
జవాబు: (B) ప్రథమా, ద్వితీయా, పంచమీ విభక్తి — చండీదత్తుడు (డు — ప్రథమ), చంచలను (ను — ద్వితీయ), దేశం నుండి (నుండి — పంచమి).
4. రాజు తన కరవాలంతో శత్రువులను ఎదిరించాడు. గీతగీసిన పదానికి పర్యాయపదాలు.
(A) ఖడ్గం, కత్తి (B) మాట, ధైర్యం (C) సైన్యం, సేన (D) చూపులు, అస్త్రాలు
జవాబు: (A) ఖడ్గం, కత్తి — కరవాలం అంటే కత్తి.
5. దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది. గీతగీసిన పదానికి ప్రకృతి పదం.
(A) సత్తు (B) సామర్థ్యం (C) సత్త్వము (D) స్ఫూర్తి
జవాబు: (C) సత్త్వము — సత్త్వము (ప్రకృతి) — సత్తువ (వికృతి). సామర్థ్యం అర్థం మాత్రమే.
6. అమ్మ యిచ్చెను — పదానికి సంబంధించి కింది వాటిలో సరైనది.
(A) ఉత్వ సంధి (నిత్యము) (B) అత్వ సంధి (బహుళం — యడాగమం) (C) ఇత్వ సంధి (వైకల్పికము) (D) గుణ సంధి (ఆదేశం)
జవాబు: (B) అత్వ సంధి (బహుళం — యడాగమం) — అమ్మ + ఇచ్చెను. అత్వ సంధి బహుళం; సంధి జరగనప్పుడు యడాగమం వచ్చి “అమ్మ యిచ్చెను” అయింది.
7. ఏమి + అంటివి = ఏమంటివి / ఏమియంటివి — ఇలా రెండు రూపాలు సిద్ధించడాన్ని వ్యాకరణంలో ఏమంటారు?
(A) నిత్యం (B) నిషేధం (C) వైకల్పికం (D) అన్యవిధం
జవాబు: (C) వైకల్పికం — ఒకసారి సంధి జరిగి, ఒకసారి జరగకపోవడం వైకల్పికం (ఇత్వ సంధి).
8. మర్రిచెట్టు కొమ్మలపై వివిధ రకాల పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. గీతగీసిన పదం ఏ వాచకానికి (లింగానికి), ఏ వచనానికి చెందినదో గుర్తించండి.
(A) మహద్వాచకం, ఏకవచనం (B) మహతీవాచకం, బహువచనం (C) అమహద్వాచకం, బహువచనం (D) అమహద్వాచకం, ఏకవచనం
జవాబు: (C) అమహద్వాచకం, బహువచనం — మనుషులు కాని జీవులు, వస్తువులు అమహత్తులు. “పక్షులు” అనేకం కాబట్టి బహువచనం.
9. “నరసింహులు మరునాడే నన్ను సమూలంగా త్రవ్వివేస్తాడు.” — ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తోంది?
(A) భూతకాలం (B) వర్తమానకాలం (C) భవిష్యత్కాలం (D) తద్ధర్మకాలం
జవాబు: (C) భవిష్యత్కాలం — “మరునాడే… త్రవ్వివేస్తాడు” — ఇంకా జరగని పని.
10. కింది వాక్యంలో ద్వంద్వ సమాస పదమును గుర్తించండి. ఆలుమగలు నవగ్రహాల చుట్టూ పదకొండుసార్లు ప్రదక్షిణం చేశారు.
(A) ప్రదక్షిణం (B) నవగ్రహాలు (C) పదకొండుసార్లు (D) ఆలుమగలు
జవాబు: (D) ఆలుమగలు — ఆలుమగలు = ఆలు, మగడు. నవగ్రహాలు ద్విగు సమాసం.
11. (అపరిచిత గద్యం) ప్రకృతి మానవుడికి ఇచ్చిన అత్యంత విలువైన వరం ఏది?
(A) వన్యమృగాలు (B) చెట్లు (C) నదులు (D) పర్వతాలు
జవాబు: (B) చెట్లు — “గొప్ప వరాలలో చెట్లు ప్రథమ స్థానంలో నిలుస్తాయి.”
12. చెట్లు మానవులకు ఏ వాయువును అందిస్తాయి?
(A) బొగ్గుపులుసు వాయువు (B) నత్రజని (C) ఆక్సిజన్ (D) హైడ్రోజన్
జవాబు: (C) ఆక్సిజన్
13. చెట్లను నరికివేయడం వల్ల కలిగే ప్రధాన నష్టం ఏమిటి?
(A) పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం (B) పరిశ్రమలు పెరగడం (C) రోడ్లు విశాలం కావడం (D) నగరం అందంగా మారడం
జవాబు: (A) పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం
14. మీ గ్రామంలో కొత్త భవనాల నిర్మాణం కోసం వందలాది చెట్లను నరికివేస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిగా మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
(A) చెట్లన్నిటినీ నరికివేసి భవనాలు నిర్మించాలి. (B) అడవులను పూర్తిగా ఖాళీ చేయాలి. (C) అవసరమైన చెట్లను మాత్రమే నరికి, వాటికి బదులుగా ఎక్కువ మొక్కలు నాటాలి. (D) ఈ విషయాన్ని పట్టించుకోకూడదు.
జవాబు: (C) అవసరమైన చెట్లను మాత్రమే నరికి, వాటికి బదులుగా ఎక్కువ మొక్కలు నాటాలి.
15. పై పేరా ఆధారంగా మన ప్రాథమిక బాధ్యత ఏమిటి?
(A) చెట్లను కొట్టడం (B) చెట్లను నాటడం, సంరక్షించడం (C) అడవులను నరకడం (D) చెట్లను కొట్టి కట్టెలను అమ్మడం
జవాబు: (B) చెట్లను నాటడం, సంరక్షించడం
విభాగం B — 2 × 2 = 4 మార్కులు (సొంత వాక్యాలు)
16. ఏకాగ్రత : [2 మార్కులు]
పరీక్షల సమయంలో ఏకాగ్రతతో చదివితే పాఠాలు బాగా గుర్తుంటాయి.
17. విశ్రాంతి : [2 మార్కులు]
రోజంతా పొలంలో పనిచేసిన రైతు సాయంత్రం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు.
విభాగం C — 2 × 4 = 8 మార్కులు
18. చిన్ని కృష్ణుని రూపాన్ని అద్భుతంగా వర్ణించిన అన్నమయ్యను గూర్చి సొంత మాటల్లో రాయండి. [4 మార్కులు]
పరిచయం: అన్నమయ్య అసలు పేరు తాళ్ళపాక అన్నమాచార్యులు. మన పాఠం “చిన్ని శిశువు” వారు రాసిన సంకీర్తన.
జననం: 1408 లో తాళ్ళపాక గ్రామంలో (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించారు.
రచనలు: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రాశారని ప్రసిద్ధి. అవి రాగిరేకుల మీద భద్రపరచబడ్డాయి.
ప్రత్యేకత: వీరిని “పదకవితా పితామహుడు” అంటారు. సామాన్యులకు అర్థమయ్యే సరళమైన తెలుగులో పాడుకోగలిగేలా రాశారు. “చిన్ని శిశువు” కీర్తనలో బాలకృష్ణుని ముంగురులు, మువ్వలు, యశోదతో అతని అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
19. విలువల విద్య ద్వారా కింది పద్యమును చదివి, భావమును సొంతమాటల్లో రాయండి.
కూరిమి గల దినములలో / నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా / కూరిమి విరసంబైనను / నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. [4 మార్కులు]
భావం: ఓ సుమతీ! ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ ఉన్న రోజుల్లో ఎదుటివారిలో ఒక్క తప్పు కూడా కనిపించదు. కానీ ఆ స్నేహం చెడిపోతే అదే వ్యక్తి చేసే ప్రతి పనీ తప్పుగానే కనిపిస్తుంది. ఇది నిజం.
సందేశం: స్నేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్న విషయాలకు గొడవపడి స్నేహం పోగొట్టుకోకూడదు.
విభాగం D — 1 × 8 = 8 మార్కులు
20. A) మర్రిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని వివరించండి.
(లేదా)
B) ‘మాయాకంబళి’ పాఠంలోని మాయాకంబళి మీకు లభిస్తే దానిని ఏవిధంగా ఉపయోగిస్తారో రాయండి. [8 మార్కులు]
B కి నమూనా జవాబు:
“మాయాకంబళి” పాఠంలో ఆ కంబళిని కప్పుకున్నవారు ఎవరికీ కనిపించరు. అలాంటి కంబళి నాకు దొరికితే దానిని స్వార్థం కోసం వాడను. ముందుగా మా ఊరిలో ఎవరైనా దొంగతనాలు, మోసాలు చేస్తుంటే కంబళి కప్పుకుని వారిని గమనిస్తాను. ఆ వివరాలు పోలీసులకు, పెద్దలకు చెప్పి దోషులను పట్టిస్తాను. పాఠశాలలో పిల్లలను ఎవరైనా ఏడిపిస్తుంటే ఆ విషయం ఉపాధ్యాయులకు తెలియజేస్తాను. రోడ్ల మీద పెద్దవారిని, పిల్లలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి అడ్డుకుంటాను. పరీక్షల్లో కాపీ కొట్టడానికి, ఇతరుల విషయాలు రహస్యంగా వినడానికి మాత్రం దానిని ఎప్పుడూ వాడను. పాఠంలో రాజు గ్రహించినట్లు అసాధారణ శక్తులు దుర్వినియోగమైతే మేలు కంటే కీడే ఎక్కువ. అందుకే అవసరం తీరిన తర్వాత ఆ కంబళిని దాని యజమాని ఆత్మానందకు తిరిగి ఇచ్చేస్తాను. మనకు దొరికిన శక్తిని ఇతరుల మేలు కోసం వాడినప్పుడే దానికి విలువ.
A రాసేవారికి ముఖ్యాంశాలు: మర్రిచెట్టు నీడలో కూర్చున్న మనుషులు తమ హక్కుల గురించి మాట్లాడుకుంటారు. కానీ అదే చెట్టు మీద ఆధారపడి బతికే పక్షులు, జీవుల గురించి, చెట్టు గురించి ఆలోచించరు; వాటికి హాని చేస్తారు. నరసింహులు చెట్టును త్రవ్వివేయాలనుకుంటాడు. అప్పుడు “మనుషులకే కాదు, చెట్లకు, పక్షులకూ బతికే హక్కు ఉంది” అని చెట్టు తన హక్కుల గురించి మాట్లాడవలసి వచ్చింది. ఈ అంశాలను పాఠంలోని సంఘటనల వరుసలో విస్తరించి రాయండి.
ఏడో తరగతి మిగతా సబ్జెక్టుల FA2 పేపర్లకు AP FA2 Question Papers 2026-27 – Class 6 to 10 చూడండి. SA1 పరీక్షకు సిలబస్ AP SA1 Syllabus 2026-27 పేజీలో ఉంది.
7th Class FA2 Telugu Question Paper — ఈ ఏడాది (2026-27) పాఠాలతో కొత్త సాధన పత్రం. 35 మార్కులు, 20 ప్రశ్నలు, ప్రతి ప్రశ్న కింద జవాబుతో. SCERT జాబితాలోని మూడు పాఠాలు — మాయాకంబళి, చిన్ని శిశువు, మఱ్ఱిచెట్టు — ప్రధానంగా. ఏడో తరగతి FA2 తెలుగు సోమవారం 05 అక్టోబర్ 2026 ఉదయం. ముందు మీరే రాసి, తర్వాత “జవాబు చూడండి” నొక్కండి.
ఈ పేజీలో ఏం మారింది (26 సెప్టెంబర్): సెప్టెంబర్ పాఠం మఱ్ఱిచెట్టు నుంచి ఇప్పుడు 8 ప్రశ్నలు (19 మార్కులు) ఉన్నాయి. ప్రశ్నలు, జవాబులు 7వ తరగతి తెలుగు వాచకం పుటలు 33 నుంచి 45 తో సరిచూశాం. ఉపవాచకం ఉత్సవాల ప్రశ్నలు తగ్గించాం, లేఖ స్థానంలో పాఠం మీద వ్యాసరూప ప్రశ్న ఇచ్చాం.
AP 7th Class FA2 Telugu 2026-27 — పరీక్ష వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| తెలుగు పరీక్ష | 05 అక్టోబర్ 2026 — ఉదయం సెషన్ (మధ్యాహ్నం గణితం) |
| సమయం | 1 గంట 15 నిమిషాలు |
| రాత పరీక్ష | 35 మార్కులు, 20 ప్రశ్నలు |
| విభాగాలు | A: 15 × 1 · B: 2 × 2 · C: 2 × 4 · D: 1 × 8 |
| పాఠాలు | మాయాకంబళి, చిన్ని శిశువు, మఱ్ఱిచెట్టు; ఉపవాచకం నుంచి మూడు ఉత్సవాలు |
మిగిలిన సబ్జెక్టుల పాఠాలు, పూర్తి టైమ్ టేబుల్ AP 7th Class FA2 Syllabus 2026-27 లో ఉన్నాయి. తెలుగు ప్రాజెక్టు పనులకు ఆలోచనలు AP FA2 Project Works 2026 లో.
ఏ పాఠం నుంచి ఎన్ని మార్కులు
| పాఠం / అంశం | మార్కులు | ప్రశ్న సంఖ్యలు |
|---|---|---|
| మాయాకంబళి | 6 | 1, 2, 19 |
| చిన్ని శిశువు (కీర్తన) | 3 | 3, 4, 5 |
| మఱ్ఱిచెట్టు | 19 | 6, 7, 8, 9, 10, 16, 18, 20 |
| కోటప్పకొండ ప్రభల తిరునాళ్లు (ఉపవాచకం) | 1 | 11 |
| రొట్టెల పండుగ (ఉపవాచకం) | 3 | 12, 17 |
| అహోబిలం పార్వేట ఉత్సవం (ఉపవాచకం) | 1 | 13 |
| భాషాంశాలు (మఱ్ఱిచెట్టు పాఠం నుంచి) | 2 | 14, 15 |
పాఠం పేరు: పుస్తకంలో నాలుగో పాఠం పేరు “మఱ్ఱిచెట్టు” — బండి ఱ తో. SCERT సిలబస్ పత్రం ఇదే మాటను “మర్రిచెట్టు” అని రాసింది. రెండూ ఒకటే. ఈ పేజీలో ఇంతకుముందు “మట్టిచెట్టు” అని ఉండేది; అది తప్పు, సరిచేశాం. ఉపవాచకం “మన విశిష్ట ఉత్సవాలు” లోని మూడు ఉత్సవాలు పుస్తకం విషయసూచికలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఉన్నా, SCERT FA2 జాబితాలో వాటి పేర్లు లేవు; అందుకే వాటికి తక్కువ మార్కులు ఉంచాం.

పరీక్షకు ముందు ఒక్కసారి చదవండి
- మాయాకంబళి: జానపద కథ. రచయిత కలువకొలను సదానంద. యోగి మంత్రించిన కంబళి కప్పుకుంటే ఇతరులకు కనిపించరు. శక్తిని వాడే బుద్ధి ముఖ్యం.
- చిన్ని శిశువు: పద కవిత. తాళ్ళపాక అన్నమయ్య కీర్తన. బాల కృష్ణుని వర్ణన. అన్నమయ్య బిరుదు పద కవితా పితామహుడు.
- మఱ్ఱిచెట్టు: స్వగతం / స్కెచ్. రచయిత త్రిపురనేని గోపీచంద్ (1910 – 1962), కృష్ణా జిల్లా అంగలూరు. “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి. చెరువు గట్టున పెరిగిన చెట్టును పంచాయితీ ప్రెసిడెంట్ నరసింహులు వేలం కోసం నరికించాడు; మొండెంగా మిగిలిన చెట్టు మళ్లీ చిగురించడానికి ప్రయత్నిస్తుంది.
- ఉపవాచకం ఉత్సవాలు: కోటప్పకొండ — త్రికోటేశ్వర స్వామి, మహాశివరాత్రి ప్రభలు. రొట్టెల పండుగ — నెల్లూరు బారా షహీద్ దర్గా, స్వర్ణాల చెరువు. అహోబిలం — నరసింహ స్వామి, పార్వేట.
7th Class FA2 Telugu Question Paper 2026-27 — 20 ప్రశ్నలు, జవాబులతో
విభాగం — A — బహుళైచ్ఛిక ప్రశ్నలు
15 × 1 = 15 మార్కులు
1. “మాయాకంబళి” కథ రచయిత ఎవరు?
(A) కలువకొలను సదానంద
(B) గురజాడ అప్పారావు
(C) కందుకూరి వీరేశలింగం
(D) శ్రీశ్రీ
జవాబు చూడండి
(A) కలువకొలను సదానంద — కలువకొలను సదానంద. పిల్లల కోసం ఎన్నో కథలు రాశారు.
2. మాయాకంబళిని కప్పుకున్న వ్యక్తికి ఏమవుతుంది?
(A) నిద్ర వస్తుంది
(B) ఇతరులకు కనిపించడు
(C) గాలిలో ఎగురుతాడు
(D) బలం రెట్టింపు అవుతుంది
జవాబు చూడండి
(B) ఇతరులకు కనిపించడు — ఇతరులకు కనిపించడు. యోగి మంత్రించిన కంబళి గొప్పతనం అదే.
3. “చిన్ని శిశువు” కీర్తనను రచించినవారు
(A) బమ్మెర పోతన
(B) వేమన
(C) తాళ్ళపాక అన్నమయ్య
(D) త్యాగరాజు
జవాబు చూడండి
(C) తాళ్ళపాక అన్నమయ్య — తాళ్ళపాక అన్నమయ్య (అన్నమాచార్యులు).
4. అన్నమయ్యకు ఉన్న బిరుదు ఏది?
(A) పద కవితా పితామహుడు
(B) వికటకవి
(C) కవి సార్వభౌముడు
(D) అభినవ పోతన
జవాబు చూడండి
(A) పద కవితా పితామహుడు — పద కవితా పితామహుడు. తెలుగులో పద కవిత (కీర్తన) కు దారి వేసినవారిగా ఈ పేరు.
5. “చిన్ని శిశువు” కీర్తనలో వర్ణించిన శిశువు ఎవరు?
(A) బాల రాముడు
(B) ప్రహ్లాదుడు
(C) ధ్రువుడు
(D) బాల కృష్ణుడు
జవాబు చూడండి
(D) బాల కృష్ణుడు — యశోద దగ్గర ఆడుకునే బాల కృష్ణుడు.
6. “మఱ్ఱిచెట్టు” పాఠం రచయిత ఎవరు?
(A) కలువకొలను సదానంద
(B) రావినూతల ప్రేమకిశోర్
(C) గురజాడ అప్పారావు
(D) త్రిపురనేని గోపీచంద్
జవాబు చూడండి
(D) త్రిపురనేని గోపీచంద్ — త్రిపురనేని గోపీచంద్ (08.09.1910 – 02.11.1962). కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు.
7. “మఱ్ఱిచెట్టు” పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
(A) జానపద కథ
(B) పద కవిత
(C) శతకం
(D) స్వగతం / స్కెచ్
జవాబు చూడండి
(D) స్వగతం / స్కెచ్ — స్వగతం / స్కెచ్. చెట్టే “నేను” అంటూ తన కథను తానే చెప్పుకుంటుంది.
8. త్రిపురనేని గోపీచంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిన రచన ఏది?
(A) ధర్మవడ్డీ
(B) పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
(C) మమకారం
(D) పోస్టు చేయని ఉత్తరాలు
జవాబు చూడండి
(B) పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా — “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా”. మిగిలిన మూడూ ఆయన ఇతర రచనలే.
9. మఱ్ఱిచెట్టు పుట్టి పెరిగిన చోటు ఏది?
(A) గుడి ఆవరణ
(B) పాఠశాల మైదానం
(C) చెరువు గట్టు
(D) అడవి
జవాబు చూడండి
(C) చెరువు గట్టు — చెరువు గట్టు. “నేను పుట్టినప్పటి నుంచీ ఈ చెరువు గట్టునే ఉన్నాను” అని చెట్టు చెబుతుంది.
10. ఎవరి నిర్ణయంతో మఱ్ఱిచెట్టును నరికేశారు?
(A) పంచాయితీ ప్రెసిడెంట్ నరసింహులు
(B) పిట్టలు కొట్టేవాడు
(C) పట్నం నుంచి వచ్చిన కుర్రకారు
(D) గ్రామ పెద్దలు స్వయంగా
జవాబు చూడండి
(A) పంచాయితీ ప్రెసిడెంట్ నరసింహులు — పంచాయితీ ప్రెసిడెంట్ నరసింహులు. చెట్లను వేలం వేయిస్తే పంచాయితీకి డబ్బు వస్తుందని చెప్పి, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు.
11. కోటప్పకొండ మీద వెలసిన దేవుడు
(A) వీరభద్ర స్వామి
(B) త్రికోటేశ్వర స్వామి
(C) నరసింహ స్వామి
(D) సుబ్రహ్మణ్య స్వామి
జవాబు చూడండి
(B) త్రికోటేశ్వర స్వామి — శ్రీ త్రికోటేశ్వర స్వామి (శివుడు). కొండకు మూడు శిఖరాలు ఉండటం వల్ల ఆ పేరు.
12. రొట్టెల పండుగ జరిగే నగరం
(A) కర్నూలు
(B) విజయవాడ
(C) నెల్లూరు
(D) గుంటూరు
జవాబు చూడండి
(C) నెల్లూరు — నెల్లూరు.
13. అహోబిలంలో కొలువైన దేవుడు
(A) వేంకటేశ్వరుడు
(B) నరసింహ స్వామి
(C) మల్లికార్జునుడు
(D) రంగనాథుడు
జవాబు చూడండి
(B) నరసింహ స్వామి — నరసింహ స్వామి.
14. “ఏమైంది” అనే పదాన్ని విడదీస్తే
(A) ఏమి + ఐంది
(B) ఏమ + ఐంది
(C) ఏమై + అంది
(D) ఏ + మైంది
జవాబు చూడండి
(A) ఏమి + ఐంది — ఏమి + ఐంది. పూర్వ స్వరం “ఇ” కారం, దానికి అచ్చు కలిసింది. ఇది ఇకార సంధి (ఇత్వ సంధి).
15. కింది వాక్యాల్లో అకర్మక వాక్యం ఏది?
(A) పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు
(B) మఱ్ఱి చెట్టు పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి
(C) పక్షి కేరుమని అరిచింది
(D) నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను
జవాబు చూడండి
(C) పక్షి కేరుమని అరిచింది — “పక్షి కేరుమని అరిచింది”. “ఎవరిని / దేనిని” అని అడిగితే జవాబు రాదు, అంటే కర్మ లేదు. మిగిలిన మూడింటిలో కడుపును, జబ్బులను, ఆమెను అనే కర్మలు ఉన్నాయి.
విభాగం — B — లఘు సమాధాన ప్రశ్నలు
2 × 2 = 4 మార్కులు
16. పనులు లేని రోజుల్లో మఱ్ఱిచెట్టు గ్రామస్థులకు ఎలా ఆశ్రయం ఇచ్చింది? (2 మార్కులు)
జవాబు చూడండి
పిల్లలు, పెద్దలు కాలక్షేపానికి దాని నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు, పులిజూదం వంటి ఆటలు ఆడుకునేవారు. (1 మార్కు)
చెట్టు వారికి శ్రమ తెలియకుండా గాలి వీచేది. దాహమైతే చెరువులో దోసిళ్లతో నీళ్లు తాగి మళ్లీ దాని నీడలోనే విశ్రాంతి తీసుకునేవారు. (1 మార్కు)
17. రొట్టెల పండుగను మత సామరస్యానికి గుర్తు అని ఎందుకు అంటారు? (2 మార్కులు)
జవాబు చూడండి
బారా షహీద్ దర్గా ముస్లింల పవిత్ర స్థలం. అయినా హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వారు కలిసి వస్తారు. (1 మార్కు)
చదువు, ఉద్యోగం, పెళ్లి, సంతానం వంటి కోరికలతో ఒకరి రొట్టె మరొకరు తీసుకుంటారు — మతం తేడా లేకుండా. (1 మార్కు)
విభాగం — C — వివరణాత్మక ప్రశ్నలు
2 × 4 = 8 మార్కులు
18. పక్షి కథను గురించి మఱ్ఱిచెట్టు ఏమి చెప్పింది? (4 మార్కులు)
జవాబు చూడండి
పిట్టలు కొట్టేవాడు వచ్చాడు: ఒకరోజు పిట్టలు కొట్టేవాడు చెట్టు దగ్గరకు వచ్చాడు. కొన్ని పక్షులు భయంతో ఎగిరిపోయాయి. పిల్లలున్న తల్లి పక్షులు వాటిని విడిచి వెళ్లలేక గూళ్లలోనే కూర్చున్నాయి. (1 మార్కు)
చెట్టు కాపాడాలని చూసింది: ఒక పక్షి భయంతో గూటి దాకా వెళ్లలేక ఒక చిన్న కొమ్మ మీద ఆకుల దగ్గర కూర్చుంది. చెట్టు దగ్గరలోని ఆకులతో దాన్ని కప్పడానికి ప్రయత్నించింది. కానీ పక్షి పెద్దది, కొమ్మ చిన్నది; కడుపు కొంత బయటకు కనిపించింది. (1 మార్కు)
పక్షి చనిపోయింది: అతను కొనకు బాకు కట్టిన పొడవాటి వాసంతో పక్షి కడుపును పొడిచాడు. పక్షి కేరుమని అరిచింది. అతను దాన్ని సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. (1 మార్కు)
చెట్టు బాధ: అతని గొంతు నులమడానికి భగవంతుడు తనకు చేతులు ఇవ్వలేదని, అతని మీద పడిపోదామనుకున్నా అతను అంతలోనే దాటిపోయాడని చెట్టు బాధపడింది. (1 మార్కు)
19. “కనిపించకుండా చేసే కంబళి మంచివాడి చేతిలో ఉంటే మేలు, చెడ్డవాడి చేతిలో ఉంటే కీడు.” మాయాకంబళి కథ ఆధారంగా మీ అభిప్రాయం రాయండి. (4 మార్కులు)
జవాబు చూడండి
కథలో జరిగింది: యోగి మంత్రించిన కంబళి చేతులు మారుతూ రాజు దగ్గరకు చేరింది. తర్వాత దాన్నే అడ్డం పెట్టుకుని రాజు ప్రాణానికే ముప్పు తలపెట్టారు. (2 మార్కులు)
నా అభిప్రాయం: శక్తి ఎంత గొప్పదైనా, దాన్ని వాడే మనిషి బుద్ధిని బట్టే మేలు, కీడు. ఎవరికీ కనిపించని శక్తి దొరికితే చాలామందికి తప్పు చేయాలనే ఆశ పుడుతుంది. అందుకే అలాంటి శక్తి కంటే నిజాయితీ, మంచి నడవడి ముఖ్యం. (2 మార్కులు)
విభాగం — D — వ్యాసరూప ప్రశ్న
1 × 8 = 8 మార్కులు
20. మఱ్ఱిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని 8 నుంచి 10 వాక్యాల్లో వివరించండి. (8 మార్కులు)
జవాబు చూడండి
మార్కుల విభజన: సందర్భం — 2, చెట్టు అడిగిన ప్రశ్నలు — 4, ముగింపు, భాష — 2.
సందర్భం: గ్రామస్థులు చెట్టు నీడలో కూర్చుని అస్తమానం హక్కుల గురించి మాట్లాడుకునేవారు. అదే మనుషులు చెట్టు కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న పక్షులు రెట్టలు వేస్తున్నాయనే నెపంతో వాటి మీద రాళ్లు విసిరేవారు. పిల్లలను విడిచి వెళ్లలేని పక్షులు భయంతో అరుస్తుంటే వాళ్లకు ఆనందంగా ఉండేది. (2 మార్కులు)
చెట్టు అడిగిన ప్రశ్నలు: తన కొమ్మలను ఆశ్రయించుకుని బతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికి ఎవరిచ్చారు? తన నీడన కూర్చుని కబుర్లు చెప్పుకునే హక్కు మనుషులకు ఉన్నప్పుడు, తన కొమ్మల మీద గూళ్లు కట్టుకుని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు తన హక్కు మాటేమిటి? తనను అడిగే తన కింద కూర్చుంటున్నారా? పక్షులు రెట్టలు వేస్తున్నాయని అంటారు, మరి తన నీడలో కూర్చుని మనుషులు ఊసే ఉమ్ముల మాటేమిటి? రాత్రిళ్లు చుట్టుపక్కలవాళ్లు తన కింద చేసే కశ్మలం సంగతేమిటి? పక్షుల మీద రాళ్లు రువ్వేటప్పుడు ఈ సంగతులు వాళ్లకు జ్ఞాపకం రావు. (4 మార్కులు)
ముగింపు: మనుషులు తమ హక్కుల గురించి మాట్లాడతారు కానీ, తమతో పాటు బతుకుతున్న మూగజీవుల హక్కులను పట్టించుకోరని చెట్టు బాధపడింది. ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి మనుషులు దిగజారారని చెప్పింది. (2 మార్కులు)
PDF — ప్రశ్నపత్రం, జవాబులు
ప్రింట్ తీసి 75 నిమిషాల్లో రాసి చూడండి: AP 7th Class FA2 Telugu Question Paper 2026-27 — Download PDF. చివరి పేజీల్లో జవాబులు ఉన్నాయి.
పాత సిలబస్ పేపర్ చూడాలనుకుంటే: 7th Class FA2 Telugu Question Paper 2023-24 (పాత సిలబస్) PDF. అందులోని పాఠాలు ఈ ఏడాది లేవు; ప్రశ్నల రకం చూడటానికి మాత్రమే.
తెలుగులో మార్కులు ఎక్కడ పోతాయి
- రచయితల పేర్లలో — అన్నమయ్యను పోతనతో, త్రిపురనేని గోపీచంద్‌ను కలువకొలను సదానందతో కలిపేయడం. ఒక్కో పేరుకు ఒక మార్కు.
- ప్రక్రియల్లో — మాయాకంబళి జానపద కథ, చిన్ని శిశువు పద కవిత, మఱ్ఱిచెట్టు స్వగతం — ఒకదానితో మరొకటి మార్చడం.
- పక్షి కథలో — పిట్టలు కొట్టేవాడు, పంచాయితీ ప్రెసిడెంట్ నరసింహులు — ఇద్దరినీ ఒకరే అనుకోవడం. చెట్టును నరికించింది నరసింహులు.
- సకర్మక, అకర్మక వాక్యాల్లో — క్రియకు ముందు “ఎవరిని / దేనిని” అని అడిగి చూడకుండా ఊహించడం. జవాబు వస్తే సకర్మకం, రాకపోతే అకర్మకం.
- వ్యాసరూప ప్రశ్నలో — పాఠం కథ మొత్తం రాసి అడిగిన సందర్భాన్ని వదిలేయడం. “హక్కులు” అని అడిగితే హక్కుల భాగమే రాయాలి.
ఆరో తరగతి తెలుగు సాధన పత్రం కావాలంటే AP 6th Class FA2 Telugu Question Paper 2026-27 చూడండి.
English సాధన పత్రం కోసం AP 7th Class FA2 English Question Paper చూడండి.
అదే వారం 07 అక్టోబర్ మధ్యాహ్నం జరిగే Social పరీక్షకు 7వ తరగతి FA2 Social Studies ప్రశ్నపత్రం కూడా జవాబులతో సిద్ధం చేసుకోండి.
తెలుగు తర్వాతి రోజు ఉదయం హిందీ ఉంది — దానికి 7వ తరగతి FA2 Hindi ప్రశ్నపత్రం జవాబులతో సిద్ధంగా ఉంది.
FA1 నుంచి FA2 కి
ఆగస్టులో రాసిన FA1 తెలుగు పేపర్‌ను AP 7th Class FA1 Telugu Answer Key 2026 తో దిద్దుకోండి — ఏ విభాగంలో మార్కులు తగ్గాయో చూస్తే ఈ వారం ఏం చదవాలో తెలుస్తుంది. పాఠ్యపుస్తకం 7th Class Telugu Textbook AP లో ఉంది. మిగిలిన తరగతుల పేపర్లు AP FA2 Question Papers 2026-27 – Class 6 to 10 లో, తెలుగు సహా అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లు AP FA2 Model Question Papers 2026-27 లో, ఏడో తరగతి పూర్తి సామగ్రి AP 7th Class Textbooks, Notes, Study Material, Question Papers & Worksheets లో, FA2 సమాచారం అంతా AP FA2 2026-27 లో ఉంది.
FAQs
1. 7వ తరగతి FA2 తెలుగు పరీక్ష ఎప్పుడు?
సోమవారం, 05 అక్టోబర్ 2026, ఉదయం సెషన్. అదే రోజు మధ్యాహ్నం గణితం. బడిలో ఇచ్చిన టైమ్ టేబుల్‌లో మార్పు ఉంటే దాన్నే పాటించండి.
2. FA2 తెలుగు రాత పరీక్షకు ఎన్ని మార్కులు?
35 మార్కులు, 20 ప్రశ్నలు — 15 బహుళైచ్ఛిక, 2 లఘు, 2 వివరణాత్మక, 1 వ్యాసరూప ప్రశ్న. FA మొత్తం 50 లో మిగిలిన 15 మార్కులు చదవడం, రాత పని, ప్రాజెక్టుకు.
3. FA2 లో ఏ తెలుగు పాఠాలు ఉన్నాయి?
SCERT జాబితా ప్రకారం మూడు: మాయాకంబళి, చిన్ని శిశువు, మఱ్ఱిచెట్టు. పుస్తకం విషయసూచికలో ఉపవాచకం లోని కోటప్పకొండ, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవాలు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఉన్నాయి; అవి పరీక్షలో ఉంటాయో మీ ఉపాధ్యాయుడిని అడగండి.
4. పాఠం పేరు మఱ్ఱిచెట్టా, మర్రిచెట్టా, మట్టిచెట్టా?
పుస్తకంలో “మఱ్ఱిచెట్టు” (బండి ఱ). ఇప్పటి రాతలో “మర్రిచెట్టు” — అర్థం ఒకటే, ఊడలు ఉండే మర్రి చెట్టు. “మట్టిచెట్టు” తప్పు.
5. ఈ పేజీలో ఇంతకుముందు 2023-24 పేపర్ ఉంది కదా?
ఉంది. అది పాత సిలబస్ పేపర్. ఈ ఏడాది పాఠాలతో కొత్త 35 మార్కుల పేపర్ ఇచ్చాం. పాత PDF లింక్ కూడా కింద ఉంచాం.
6. “స్వగతం” అంటే ఏమిటి?
ఒక పాత్ర తన మనసులోని మాటలను తానే చెప్పుకోవడం. మఱ్ఱిచెట్టు పాఠంలో చెట్టే “నేను” అంటూ తన జీవితం, బాధ చెబుతుంది. పుస్తకం విషయసూచికలో ఈ పాఠం ప్రక్రియ “స్వగతం / స్కెచ్”.
7. 8 మార్కుల ప్రశ్నకు ఎలా రాయాలి?
మూడు భాగాలుగా: సందర్భం ఏమిటి, పాఠంలో ఏం జరిగింది లేదా ఎవరు ఏమన్నారు, చివర మీ ముగింపు. 8 నుంచి 10 వాక్యాలు చాలు. పాఠంలోని ముఖ్యమైన మాటలు (హక్కు, ఆశ్రయం, నిస్వార్థం) వాడితే మంచిది.
8. కవుల పేర్లు ఎందుకు గుర్తుంచుకోవాలి?
బహుళైచ్ఛిక విభాగంలో “ఈ పాఠం రచయిత ఎవరు?” అనే ప్రశ్న దాదాపు ప్రతిసారీ వస్తుంది. ఈ పేపర్‌లో కవి, రచయితల మీదే నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.
9. మఱ్ఱిచెట్టు పాఠంలో ఏ వ్యాకరణాంశాలు ఉన్నాయి?
మూడు: ద్వితీయా విభక్తి (రామాయణాన్ని = రామాయణము + ని), సకర్మక, అకర్మక వాక్యాలు, ఇకార (ఇత్వ) సంధి (ఏమైంది = ఏమి + ఐంది).
10. జవాబులు పుస్తకంలోని వాక్యాలు యథాతథంగా రాయాలా?
అవసరం లేదు. విషయం సరిగా ఉండి, సొంత మాటల్లో స్పష్టంగా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
11. ఈ ప్రశ్నలే పరీక్షలో వస్తాయా?
రావు. సిలబస్‌లోని పాఠాల ఆధారంగా మేము తయారు చేసిన సాధన ప్రశ్నలు. ప్రశ్నల రకం, సమయం అలవాటు చేసుకోవడానికి.
12. PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు. కింది PDF విభాగంలో ప్రశ్నపత్రం, చివరి పేజీల్లో జవాబులతో ఒకే ఫైల్ ఉంది.
Official Sources
పాఠాల జాబితా, పరీక్ష తేదీ AP SCERT సిలబస్ ఆధారంగా. ఏడో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం cse.ap.gov.in లో ఉచితం. మఱ్ఱిచెట్టు పాఠ్యాంశం 7వ తరగతి తెలుగు వాచకం (తెలుగు బాట, పుటలు 33–45) తో సరిచూశాం. ప్రశ్నలు, జవాబుల రచన మాది.
FA2 లో రాని ఐదు పాఠాలపై ప్రశ్నలతో SA1 తెలుగు సాధన పేపర్, జవాబులు, స్కోర్ కార్డ్: AP 7th Class SA1 Telugu Question Paper 2026-27
